Site icon Prime9

Chepa Mandu : మూడేళ్ళ తర్వాత బత్తిని వారి “చేప ప్రసాదం” పంపిణీ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సర్కారు

bathina family chepa mandu distribution started in hyderabad

bathina family chepa mandu distribution started in hyderabad

Chepa Mandu : హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్‌ నేతృత్వంలో జరగనున్న ఈ పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ సర్కారు పూర్తి ఏర్పాట్లు చేసింది. కరొన కారణంగా మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడంతో ఈసారి భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతున్నారు. ఆస్తమా, ఉబ్బసం రోగుల ఇబ్బందుల నుంచి ఊరటనిస్తుందని విశ్వసించే బత్తిని బ్రదర్స్‌ చేపమందు పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ చేప మందు ప్రసాదం కోసం.. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఆస్తమా రోగులు తరలివస్తుంటారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే శుభతిథి ప్రకారం శుక్రవారం ( జూన్ 9, 2023 ) ఉదయం 8 గంటలకు చేప మందు పంపిణీ ప్రారంభించారు.

బత్తిని కుటుంబీకులు సుమారు 5 లక్షల మందికి సరిపడేలా ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం అదనంగా గాంధీసెంటినరీ హాల్‌ వైపు అయిదు ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. చేప ప్రసాదాన్ని గర్భిణులు మినహా అందరూ స్వీకరించవచ్చని బత్తిని కుటుంబీకులు స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవాళ, రేపు.. బత్తిన సోదరులు చేప ప్రసాదం పంచనున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం వరకే దేశం నలుమూలల నుంచి సుమారు 25 వేల మందికి పైగా ఆస్తమా బాధితులు తరలిరావడంతో మైదానం కిటకిటలాడుతోంది. వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో జీహెచ్‌ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు సమకూరుస్తున్నాయి. మత్స్యశాఖ 2.50 లక్షల కొర్రమీను చేపపిల్లలను సమకూర్చింది.

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు..

చేపమందు పంపిణీకి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 34 కౌంటర్లు, 32 క్యూలైన్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరిపడా టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఉన్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో రెండు రోజుల పంపిణీ తర్వాత పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ నివాసంలో బత్తిని కుటుంబం వారం రోజులపాటు చేప ప్రసాదం అందించనుంది. ప్రయాణీకుల కోసం రెండు రోజులపాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు, తెలంగాణలోని వివిధ ప్రాంతల నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీని ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.

 

Exit mobile version