CM KCR Comments: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కల్యాణంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ మేరకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 2 కిలోల బంగారు కిరీటాన్ని స్వామివారికి బహుకరించారు. వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ మరో రూ.7 కోట్లు ప్రకటించారు.
బాన్సువాడ నియోజకవర్గానికి రూ.50 కోట్లు (CM KCR Comments)
బాన్సువాడ నియోజకవర్గానికి మరో రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా ప్రసిద్ధి కెక్కిన తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి గతంలోనే రూ.23 కోట్లు మంజూరు చేయగా.. తాజాగా మరో రూ.7కోట్లను మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి..
వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని కేసీఆర్ అన్నారు. గతంలోనే ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నామని కేసీఆర్ తెలిపారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొద్దిమంది మిత్రులతో కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరినట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు కేసీఆర్ అన్నారు. అదే విధంగా బాన్సువాడ నియోజకవర్గానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో కష్టపడ్డారని.. ఆయన కృషితో ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. పోచారం వయసు పెరుగుతున్న.. ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేసీఆర్ చమత్కరించారు. బాన్సువాడకు ఆయన ఇంకా సేవ చేయాల్సిందేనని నవ్వుతూ తెలిపారు.