CM KCR in Nagar Kurnool: తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ అన్నారు. అవార్డులు, రివార్డుల్లో తెలంగాణ ముందుందని చెప్పారు. అందరం కలిసి కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ అన్నారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూల్ బహిరంగ సభలో మాట్లాడుతూ త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం ఏ పిలుపు ఇచ్చినా యజ్జంలా పనిచేసిన ఉద్యోగులందరికీ నమస్కారాలు తెలుపుతున్నానని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పధకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇంత తక్కువ సమయంలో దేశంలో మిగిలిన ప్రాంతాలకంటే తెలంగాణ అద్బుతమైన ప్రగతిని సాధించిందని కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయం, అక్ష్యరాస్యత, శిశుమరణాలు, ప్రసవాల సమయంలో మరణాలు అన్నింటిలోనూ తెలంగాణ మంచి ఫలితాలు సాదించిందని కేసీఆర్ అన్నారు. వలసలకు దుఖాలకు, ముంబయ్ బస్సులకు మారుపేరుగా ఉండే మహబూబ్ నగర్ జిల్లా నేడు పచ్చని పంటలతో ఉందన్నారు. వర్షాకాలం రాకముందే చెరువులన్ని నీటితో నిండి ఉన్నాయని దీనితో తన కళ్లు ఆనంద బాష్పాలతో నిండాయన్నారు. అచ్చంపేట ప్రాంతానికి ఎత్తిపోతల పధకాలతో నీటిని తీసుకు వస్తున్నామన్నారు. వలప పోయిన వారందరూ వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇక్కడ పొలాల్లో పనిచేయడానికి ఒరిస్సా నుంచి కూలీలు వస్తున్నారని భూముల రేట్లు పెరిగాయని అన్నారు.
నాగర్‌కర్నూల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. నూతన కలెక్టరేట్ లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కలెక్టర్ ని కుర్చీలో కూర్చోబెట్టి సీఎం కేసీఆర్ అభినందించారు. సీఎం కేసీఆర్ కు శాలువా కప్పి సత్కరించారు కలెక్టర్.నాగర్ కర్నూల్ చేరుకున్న సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.. బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని.. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజును అభినందించారు.
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జిల్లా పోలీస్ కార్యాలయాల కాంప్లెక్స్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్, డీజీపీ అంజనికుమార్ యాదవ్ పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్ ఎస్పీ మనోహర్‌ను సీటులో కూర్చోబెట్టి అభినందించారు.