Telangana Congress: హైదరాబాద్ గాంధీ భవన్‌లో టికాంగ్రెస్ పీఏసి సమావేశమైంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, పీఎసి సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 15 నుండి ప్రారంభించాలనుకుంటున్న బస్సు యాత్ర షెడ్యూల్ ,రూట్ మ్యాప్ పై చర్చించారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో తాజా రాజకీయాలు , ఎన్నికల్లో వ్యవహరించల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు.
పొత్తులపై చర్చలు సాగుతున్నాయి..(Telangana Congress)
మేనిఫెస్టో అంశాలు, కుల గణన, అభ్యర్థుల ఎంపిక, బిసి అంశం తదితర అంశాలపై కూడా చర్చించారు. పొత్తులపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌కు ఓ విధానం ఉంది. అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే అభ్యర్థిత్వం ఖరారవుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లపై మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఒక వైపు గాంధీభవన్‌లోపొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతుంటే మరోపక్క ఆ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. గిరిజనులకు ఐదు టికెట్లు కేటాయించాలంటూ గాంధీభవన్ మెట్లపై గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిరసనకు దిగారు. గిరిజనులకు ఐదు జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో గాంధీ భవన్‌లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనకి దిగారు. నాగర్ కర్నూల్ టికెట్ నాగం జనార్దన్ రెడ్డికి టికెట్ కేటాయించాలని కోరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నాగం వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరికి తోడుగా గోషా మహల్ కాంగ్రెస్ నేతలు కూడా గాంధీ భవన్ వద్ద ధర్నాకి దిగారు. గోషామహల్‌లో నివసించే స్థానిక నేతలకి మాత్రమే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.