Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నేటినుంచి అభ్యర్థులు ఖర్చులను ఎన్నికల కమీషన్ లెక్క గట్టనుంది. అందుకే నోటిఫికేషన్ కు ముందే పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి నెల రోజుల్లోపు ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.
నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. తర్వాత ఇదే నెల 13న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నవంబర్ 15 వరకు అవకాశం కల్పిస్తారు. తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేసి. ఈవిఎంలు సిద్ధం చేస్తారు. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన ఈ రోజు రిలీజ్ అయినప్పటికీ ఎన్నికల కమీషన్ మాత్రం గత కొద్ది రోజులనుంచి రంగంలోకి దిగింది.నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదంటూ పలువురు అధికారులపై కొరడా ఝులిపించింది. వీరిని బదిలీ చేసి వారి స్దానంలో కొత్త అధికారులను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి పెద్ద మొత్తంలో బంగారం,నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. అదనపు కేంద్ర బలగాలు మెజారిటీ జిల్లాలకు చేరుకుని, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత వాతావరణంలో ఓటు వేయగలమన్న విశ్వాసాన్ని ఓటర్లలో పెంపొందించేందుకు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించాయి.