Telangana Assembly Budget Sessions 2025: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు వచ్చారు. ఈ మేరకు ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభ్యులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన విధి విధానాలు, వ్యూహాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం బడ్జెట్‌పై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ రూపొందించారన్నారు. సామాజిక న్యాయం, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ప్రజలకే కేంద్రంగా పాలన సాగుతోందని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ వివరించారు. రాష్ట్రం అభివృద్ధి, ప్రగతి వైపు పయనిస్తోందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయమని, రూ25వేల కోట్ల రుణమాఫీ చేశామని గవర్నర్ చెప్పారు. మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని గవర్నర్ వెల్లడించారు.
దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి ఉంటుందని గవర్నర్ అన్నారు. వరి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, ఇప్పటివరకు రూ.1,206 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో యువతలో నైపుణ్యం పెంచుతున్నామన్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని, ఇందు కోసం రూ.25వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పేదలకు 200 యూనిట్లకు వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇల్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.
ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామని, కొత్తగా 163 సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. దీంతో పాటు టీజీపీఎస్‌సీని బలోపేతం చేశామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని, జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా గుర్తించామన్నారు.
రైతు భరోసా కింద ఎకరానికి రూ.12వేల సాయం అందించామని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తున్నామన్నారు. నీటి వాటా కోసం కృష్ణా ట్రి బ్యూనల్ ముందు వాదనను వినిపించామని, భావితరాలకు నీటివనరులను భద్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్ అని, ఉచిత బస్సు పథకానికి రూ.5,005.95 కోట్లు ఖర్చు చేశామన్నారు.