CM KCR: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ.. భారత్ లో అంతర్భాగమయిందని సీఎం కేసీఆర్ అన్నారు. అమర వీరులకు నివాళులు అర్పించిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ధిలో దూసుకు పోతున్నాము..(CM KCR)
ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో భాగమైన సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవం’గా జరుపుకోవడం సముచితమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దార్శనికత, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ చాకచక్యం, ఎందరో నేతల కృషి వల్లే దేశం ఏకమైందని సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రాలో తెలంగాణ ప్రజలకు ఎంతో అన్యాయం జరిగిందని.. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దూసుకు పోతున్నామని అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలను ఎత్తిచూపుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు.తన ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనం పొందని కుటుంబం లేదని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. తెలంగాణ తరహా పాలనను ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారని కేసీఆర్ అన్నారు.