Telangana RTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకి సత్వరమే ఆమోదం తెలుపనందుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఈ ఉదయం బస్సులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ర్యాలీగా చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాలని గమనిస్తున్న గవర్నర్ తమిళి సై ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చలకు ఆహ్వనించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె వార్త విని బాధ పడ్డానని గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు. ఇది సాధారణ ప్రజలని ఇబ్బంది పెట్టడమేనని తమిళిసై అన్నారు. తాను ఎప్పటికీ ఆర్టీసీ కార్మికుల పక్షాన్నే ఉంటానని గవర్నర్ తెలిపారు. 2019 సమ్మె కాలంలో కూడా తాను ఆర్టీసీ కార్మికుల తరపునే మాట్లాడానని తమిళిసై గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లుని కూడా తాను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నానని గవర్నర్ వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల హక్కులకి భంగం కలగూడదనే లోతుగా పరిశీలిస్తున్నానని తమిళిసై తెలిపారు.గవర్నర్ తీరుకు నిరసనగా రాజ్‌భవన్ ను ముట్టడికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో ఆర్టీసీ కార్మికులు ముట్టడికి బయలుదేరారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తీరును తప్పుపడుతూ టీఎంయూ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో రాజ్ భవన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లు (ప్రభుత్వ సేవల్లోకి ఉద్యోగుల స్వీకరణ)పై అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాత సంతకం చేస్తానని, ప్రక్రియకు ‘మరింత సమయం’ పడుతుందని గవర్నర్ శనివారం ప్రకటన చేసిన తర్వాత కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేసాయి.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)లో 43,000 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జూలై 31, సోమవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మార్గదర్శకాలను రూపొందించేందుకు అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
బిల్లు ఆమోదం పొందిన తర్వాత టీఎస్సార్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా వర్గీకరించబడతారు, తద్వారా వారు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు.ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు చాలా దగ్గరగా వస్తున్నందున బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.