Site icon Prime9

TTD EO Dharma Reddy: ఈనెల 10 నుంచి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు.. టీటీడీ ఈవో దర్మారెడ్డి

TTD EO

TTD EO

TTD EO Dharma Reddy:శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అందరి స‌హ‌కారంతో విజ‌య‌వంతంగా నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 10 నుంచి 18 వరకు వైభ‌వంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయన్నారు. విశేషమైన పంచమి తీర్థం నాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందుకోసం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తాం. దాదాపు రూ.9 కోట్ల వ్యయంతో అమ్మవారి పుష్కరిణి ఆధునీకరణ పనులు చేపట్టాం. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నారని దర్మారెడ్డి తెలిపారు.

శ్రీవారి పుష్పయాగం..(TTD EO Dharma Reddy)

నవంబరు 19న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం జరుగనుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం నవంబరు 18న అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ పుష్పయాగం ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా నవంబరు 4న శనివారం 1000 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తాం. టికెట్‌ ధర రూ.700/-గా నిర్ణయించామన్నారు. పుష్పయాగం టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు ఒక చిన్నలడ్డూ, ఉత్తరీయం, బ్లౌజ్‌ పీస్‌ బహుమానంగా అందిస్తామన్నారు.

నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలి..

తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో అక్టోబ‌రు 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుండి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో రెండు చిరుతలు, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్‌లో నమోదయింది. కావున నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగానే వెళ్లాలని విజ్ఞప్తి చేసారు. 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయని ఈవో తెలిపారు. అదేవిధంగా, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు. చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయని ఈవో దర్మారెడ్డి తెలిపారు.

Exit mobile version