SIT Report: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు ,పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తు పూర్తిచేసింది .సోమవారం మధ్యాన్నం డీజీపీని కలిసి సిట్ చీఫ్ బ్రీజ్ లాల్ తమ నివేదికను సమర్పించారు .దర్యాప్తులో భాగంగా సిట్ బృందం అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించింది . ఈ క్రమంలో తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఘర్షణ కేసు వివరాలను ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో సిట్ బృందం పరిశీలించింది. సిట్ బృందం లోని సభ్యులు డీఎస్పీ మనోహరాచారి. ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ , సిఐ లను విచారించారు. చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పులివర్తి నానిపై హత్యకు యత్నించిన మహిళా విశ్వవిద్యాలయ ప్రాంతాన్ని సిట్ బృందం పరిశీలించింది . తర్వాత చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లిలో కూడా విచారణ చేపట్టారు. కూచివారిపాలెంలో దాడులపై గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను సేకరించారు . రామిరెడ్డిపల్లె సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి గన్ మెన్ ఈశ్వర్‌ను సైతం విచారించారు.
సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి.. (SIT Report)
అదేవిధంగా పల్నాడు లో కూడా సిట్ బృందం విచారణ జరిపింది .నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు దర్యాప్తు చేసారు . అల్లర్ల సమయంలోని వీడియోలను పరిశీలించారు. ఇక్కడ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది .మరో వైపు సిట్ విచారణ కొనసాగుతున్న సమయంలోనే మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన సిట్ తమ నివేదికను డిజిపికి సమర్పించింది . అల్లర్లు జరిగిన ప్రతి ప్రాంతాన్ని సందర్శించి బాధితులను కలిసి సమాచారం రాబట్టారు . ప్రతి ఎఫ్ ఐ ఆర్ నూ క్షుణ్ణంగా పరిశీలించినట్లు సిట్ బృందం తెలిపింది . మరోవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్న నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ కు మంత్రి అంబటి రాంబాబు రావడం చర్చనీయాంశమైంది. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై సిట్‌కు ఫిర్యాదు చేసేందుకు అంబటి రాంబాబు వచ్చినట్లు తెలుస్తోంది.అంబటి మినహా ఏ రాజకీయ నాయకుడు సిట్ ను కలవకపోవడం గమనార్హం .