V. Vijayasai Reddy: రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ షాక్ ఇచ్చారు. ప్యానల్ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి పేరు తొలగించినట్లు తెలిపారు. ఈ నెల 5న విజయసాయిరెడ్డికి పంపిన లేఖలో ప్యానల్ వైస్ చైర్మన్‌గా నియమించినట్లు రాజ్యసభ ఆఫీస్ సమాచారం అందించింది.. విజయసాయి పేరును జాబితా నుంచి తొలగించినట్లు రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు. మిగతా ఏడుగురి ప్యానల్ వైస్ చైర్మన్ల పేర్లను మాత్రమే చైర్మన్ చదివారు.
మంగళవారం మొత్తం 8 మందితో రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌ను ప్రకటించారు. అయితే బుధవారం రాజ్యసభలో ప్యానెల్ సభ్యుల జాబితాను వెల్లడిస్తూ ఏడుగురి పేర్లే చదివారు. అందులో విజయసాయి పేరు లేకపోవడం గమనార్హం. అయితే దీనికి కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఒక్కరోజు వ్యవధిలో ఏం జరిగిందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో డాక్టర్ ఎల్ హనుమంతయ్య, భుభనేశ్వర్ కలిటా, సురేంద్ర సింగ్ నాగర్, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్ రే, డాక్టర్ శస్మిత్ పాత్రా, సరోజ్ పాండేలు స్థానం సంపాదించారు.
రాజకీయ నేతలపై విజయసాయి అసభ్యకర ట్వీట్లు చేస్తున్నారంటూ ఇటీవల రాజ్యసభ చైర్మన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. విజయసాయిని ప్యానల్ వైస్‌చైర్మన్ నుంచి తొలగించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని రాజ్యసభ చైర్మన్ చైర్‌లో కూర్చోబెడితే ఆ పదవికే అగౌరవం ఏర్పడుతుందని ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను.. ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్ లేషన్ చేసి మరీ.. రాజ్యసభ చైర్మన్‌కు పంపారని అంటున్నారు. ఈ కారణంచేతనే విజయసాయి పేరు తొలగించారని అంటున్నారు.