Telangana Sheep Scheme Scam: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని ఏసీబీ దర్యాప్తులో తెలింది. పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో.. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీగా పనిచేసిన రాంచందర్ నాయక్, పశుసంవర్ధకశాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు.
2.1 కోట్ల నగదు మళ్లింపు..(Telangana Sheep Scheme Scam)
ఈ ఇద్దరినీ విచారించిన అనంతరం ఇంత భారీ మొత్తం కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. తొలుత సుమారు 2.1 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే పదిమంది నిందితులను గుర్తించగా, ఆరుగురిని అరెస్టు చేశారు. ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్టవగా ఏకంగా ఇప్పుడు సీఈవో స్థాయి అధికారి, మాజీ మంత్రి మాజీ ఓఎస్డీ అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది. రాంచందర్ గతంలో పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి పశుగణాభివృద్ధి సంస్థ సీఈవోగా నియమించింది. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలుత గచ్చిబౌలి పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేశారు. పశుసంవర్ధకశాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి.. అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు.
బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని 2.1 కోట్లను మళ్లించినట్లు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారులను విచారించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో అతడ్ని అరెస్టు చేయబోగా అతడు దుబాయ్‌కి పారిపోయాడు. ఇప్పటికే అరెస్ట్ చేసిన వారి నుంచి సేకరించిన సమాచారం, రికార్డుల ఆధారంగా రాంచందర్, కల్యాణ్‌ల పాత్ర తేటతెల్లమైంది. బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతోనే గొర్రెలు కొనాలని వీరిద్దరూ రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులకు, ఇతర అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడైంది. దీనితో వీరిని అరెస్ట్ చేసిన అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుచగా.. న్యాయస్థానం వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.