D.Srinivas passed away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. డీఎస్ ఇకలేరన్న వార్త తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ లోని నివాసం దగ్గరకి పెద్ద ఎత్తున నేతలు చేరుకుంటున్నారు.
అన్నా అంటే నేనున్నానని..ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరంటూ డీఎస్ తనయుడు ఎంపీ ధర్మపురి అరవింత్ కన్నీటి పర్యంతమయ్యారు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా..నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’’ అని అర్వింద్ కన్నీటి పర్యంతమయ్యారు.
డీఎస్ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ లీడర్లతో పాటు బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువరు బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. ఆయన గతంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యునిగా పనిచేయడంతో.. పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితం సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాట పలువురు డీఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నారు. దీఎస్ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం డీఎస్ పార్థివ దేహాన్ని హైదరాబాదులోని ఆయన నివాసంలో.. కార్యకర్తలు, నేతల సందర్శనకోసం ఉంచారు. ఇవాళ సాయంత్రంలోపు ఆయన పార్థివ దేహాన్ని నిజామాబాదుకు తరలించనున్నారు. రేపు నిజామాబాదులో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారులు తెలిపారు.