Gundlakamma Project: ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు వరద తాకిడికి రెండో గేటు కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టునుంచి నీరు వృథాగా పోతోంది.యుద్ధ ప్రాతిపదికన ఇంజనీరింగ్ అధికారులు స్టాప్ లాక్స్ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. నీరు ఆగకపోవడంతో… మూడు గేట్లుఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే ప్రాజెక్టు దిగువభాగంలో ఉన్న గ్రామస్థులు అప్రమత్తం చేశారు. మరోవైపు ఈ ప్రాజెక్టును జనసేన, టీడీపీ ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు దెబ్బతింటున్నాయని విమర్శించారు
మండిపడుతున్న రైతులు..(Gundlakamma Project)
గత ఏడాది సెప్గెంబర్ లో ఇదే ప్రాజెక్టులో మూడో నంబర్ గేటు కొట్టుకుపోయింది. అప్పటినుంచి మూడో గేటుకు ఇప్పటికీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయలేదు.. అధికారుల పర్యవేక్షణ లోపం, సరైన మరమ్మతులు లేకపోవడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడవ గేటు విరిగిపోయింది. బుధవారం రాత్రి గేటు దిగువభాగం దెబ్బతినటంతో భారీస్థాయిలో నీరు వృథాగా పోతోంది. దీర్ఘకాలంగా గేట్లు నిర్వహణ, మరమ్మతుల్లో జరుగుతున్న నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనితో 2వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలైంది. తాజాగా ఇపుడు రెండవ గేటు కొట్టుకుపోవడంతో ప్రభుత్వ నిర్లక్యంపై రైతులు, స్దానిక నేతలు మండిపడుతున్నారు.
గేటు రిపేరు చేయింలేని సీఎం..
గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు రిపేరు చేయించలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కట్టిస్తానంటున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. శనివారం పరుచూరు నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గేటు రిపేర్లు గురించి అడిగితే ఎవరూ రావడం లేదని చెబుతున్నారని దీనిని బట్టి వారి ప్రభుత్వంపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తోందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలన రెండువేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలయిందన్నారు. ఈ నీటితో 40 వేల ఎకరాలకు నీరు అందించవచ్చని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఇసుక మీద ఉన్న ప్రేమ దేనిమీదా లేదని మండిపడ్దారు.