Sankalpasiddhi Scam : విజయవాడ కేంద్రంగా జరిగిన ఈ సంకల్పసిద్ది కుంభకోణం వెనక వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని, టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రమేయం వుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే వంశీ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఏపీ డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేసారు.
డిజిపిని కలిసిన అనంతరం వంశీ మాట్లాడాతూ… సంకల్ప సిద్ది కేసులో వస్తున్న నిరాధార ఆరోపణల నేపథ్యంలోనే డిజిపిని కలిసినట్లు తెలిపారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సామాన్య ప్రజలను మోసం చేసిన సంకల్ప సిద్ది కేసులో నిజా నిజాలను విచారణ చేయించాలని డీజీపీని కోరానన్నారు. తనపై ఆరోపణలు చేసిన టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం, కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు బచ్చుల అర్జునుడికి చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరినట్లు వంశీ తెలిపారు.
ఏపీలోని గుడివాడ, గన్నవరం కేంద్రంగా సంకల్పసిద్ది ఈ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ద ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. కేవలం లక్ష పెయిడ్ అప్ క్యాపిటల్ తో 17 మే 2002న రిజిస్టర్ కాబడిన ఈ కంపెనీ రూ.1100 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని టీడీపీ చెబుతోంది. రూ.20 వేలు చెల్లిస్తే , 10 నెలల్లో రూ. 60 వేలు ఇస్తామని ఆశపెట్టి జనాన్ని ముంచేసింది. తొలుత రూ.20 వేలు సంస్దలో పెట్టుబడి పెడితే రోజుకి రూ.200 చొప్పున 10 నెలల్లో రూ.60 వేలు తిరిగి ఇస్తారని సంకల్పసిద్ది ఈ కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ద ఏజంట్లు ప్రచారం చేసారు. ఇలా పలుస్కీమ్ లను పరిచయం చేయడం ద్వారా జనం నుంచి రూ.1100 కోట్లు కొల్గగొట్టారు. తరువాత సంకల్పసిద్ది మార్ట్ ల పేరుతో దుకాణాలు తెరిచారు. ఆగ్రోఫామ్స్, గంధపు చెట్ల పెంపకం, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం ద్వారా వచ్చే సొమ్మును పెట్టుబడిపెట్టిన వారికి పంచుతామని మోసగించారు.