RTC MD Sajjanar: తెలంగాణలో తక్కువ దూరాలు ప్రయాణించే మహిళా ప్రయాణీకులు ఎక్స్ ప్రెస్ బస్సుల కన్నా పల్లె వెలుగు బస్సులను ఆశ్రయించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్జప్తి చేసారు.
తక్కువ దూరాలకు కూడా పలువురు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ దృష్టికి వచ్చింది.
సిబ్బందికి సహకరించాలి..(RTC MD Sajjanar)
దీనితో ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు ఇబ్బంది పడుతున్నారని అందువలన మహిళలు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. అంతేకాకుండా మరికొందరు ప్రయాణీకులు అనుమతించిన బస్సు స్టాపుల్లో కాకుండా మధ్యలోనే ఆపాలంటూ బస్సు సిబ్బందిపై వత్తిడి తెస్తున్నారని తెలిసిందన్నారు. ఇకపై నిర్దేశించిన బస్సు స్టాపుల్లోనే బస్సులు ఆపాలంటూ సిబ్బందికి సజ్జనార్ సూచించారు. తెలంగాణలో మహాలక్ష్మి పధకం కింద మహిళా ప్రయాణీకులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఇంతవరకూ ఇతర రవాణా సాధనాలను ఉపయోగిస్తున్నవారు కూడా బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనితో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. సీట్లు దొరకడం లేదని పలువురు గోల పెడుతున్నారు. బస్సు సర్వీసులను పెంచాలని పలువురు కోరుతున్నారు.