CPI Narayana : రిషికొండను రేప్ చేస్తున్నారు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

విశాఖలో రిషికొండను రేప్ చేస్తున్నారని ప్రకృతిని రేప్ చేసిన పాపం ఊరికేపోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 01:19 PM IST

Rushikonda: విశాఖలో రిషికొండను రేప్ చేస్తున్నారని ప్రకృతిని రేప్ చేసిన పాపం ఊరికేపోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీ హైకోర్టు అనుమతితో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ శుక్రవారం నాడు రిషికొండలో నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.

రిషికొండలో లగ్జరీ విల్లాలు, రూమ్స్ , ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నారని నారాయణ చెప్పారు.జగన్ తన ఇల్లును ఎలా కట్టుకున్నారో రిషికొండలో నిర్మాణాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయని ఆయన తెలిపారు. సహజ సిద్దమైన ప్రకృతి అందాలను రిషికొండ కోల్పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విలాసవంతమైన భవనాల నిర్మాణాలతో సహజసిద్దమైన ప్రకృతి అందాలను చూడలేమన్నారు.సహజ సిద్దమైన రిషికొండను ధ్వంసం చేయడం ఎందుకని ఆయన అడిగారు. 50 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తున్నారని అన్నారు. రిషికొండలో నిర్మాణాలను పరిశీలించేందుకు ఎందుకు అనుమతించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రహస్యంగా ఉంచడం వల్లే అనేక అనుమానాలు వస్తున్నాయని నారాయణ అభిప్రాయపడ్డారు. రిషికొండలో నిర్మాణాలను పరిశీలించేందుకు వచ్చే వారిని అనుమతిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.రిషికొండను తాను ఏమైనా పేలుడు పదార్ధాలు తీసుకెళ్తున్నానా అని ఆయన ప్రశ్నించారు. తనను రిషికొండకు వెళ్లకుండా పర్యాటక శాఖ ఎందుకు అభ్యంతర పెట్టిందో అర్ధం కాలేదన్నారు.

తాను కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే రిషికొండను సందర్శించేందుకు అనుమతిని ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు.చివరకు తనను ఒక్కరిని మాత్రమే పర్యాటక శాఖ అధికారులు అనుమతించారన్నారు.