Rapido: మే 13న జరగనున్న లోక్‌సభ మూడవ విడత ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయడానికి వారికి అవగాహన కార్యక్రమాలు కూడ కల్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో బైక్ ట్యాక్సీ ప్రొవైడర్ రాపిడో పోలింగ్ రోజున ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉచిత వాహన సేవలు అందించడానికి ముందుకు వచ్చింది.
ఓటింగ్ ను పెంచాలని..(Rapido)
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ,వరంగల్ జిల్లాలు, మల్కాజిగిరి, సికింద్రాబాద్ మరియు చేవెళ్ల ప్రాంతాల్లోని ఓటర్లకు ఉచిత వాహన సేవలను అందించాలని నిర్ణయించింది.అదేవిధంగా హైదరాబాద్ నగరంలోని 2,600 పోలింగ్ కేంద్రాల్లో రాపిడో సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయింది. దీనిని పెంచాలనే ఆలోచనలో తాము ఓటర్లకు రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయించామని రాపిడో నిర్వాహకులు తెలిపారు. రవాణా సదుపాయం లేని కారణంగా ఎవరూ ఓటింగ్ కు దూరంగా ఉండకూడదన్నది తమ లక్ష్యమన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాపిడో చొరవను ప్రశంసించారు.