Rains in Telangana: కొద్ది రోజులుగా ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు నుంచి మంగళవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనితో తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
పిడుగుపాటుతో ముగ్గురి మృతి..(Rains in Telangana)
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో ఐదు సెంటీ మీటర్లు, నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లోని బీరవెళ్లిలో ఐదు సెంటీ మీటర్లు, నారాయణపేట జిల్లా ధన్వాడ నాలుగు సెంటీ మీటర్లు, నిర్మల్ జిల్లా భైంసలోని వనాల్‌పహాడ్‌లో నాలుగు సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, కరీంనగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.నిన్న వేర్వేరు చోట్ల పిడుగుపాటు కారణంగా ముగ్గురు మృతి చెందారు. కుమురం భీం జిల్లా బెజ్జూరులోని పోతపల్లికి చెందిన తొడిశం పోసక్క చేనులో పనిచేస్తున్న సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో ఉన్న బుదాబాయనే వృద్ధురాలుకు తీవ్రగాయలయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమారంలో బండారి లింగయ్య బయటకు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో పిడుగు పడి మృతి చెందారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని కోనేరుపల్లిలో అప్పాల కొమురమ్మ అనే మహిళ సాయంత్రం పిడుగుపాటు కారణంగా మృతి చెందారు.
హైదరాబాద్‌లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమయ్యింది. నాలాలు ఉప్పొంగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు.: