Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ఈ వాన కబురుతో చల్లబడనున్నారు. కాగా రానున్న ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో మళ్లీ వర్షాలు కురిస్తాయని ప్రకటించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీ లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే మరికొన్ని ప్రదేశాల్లో చిరుజల్లులు నుంచి మోస్తరు వర్షాలు కూడా పడతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే.
మరోవైపు తెలంగాణలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలానే పలు జిల్లాలలో పరిస్థితుల దృష్ట్యా ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ లను జారీ చేసింది.