Priyanka Gandhi: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ఆమె.. హైదరాబాద్ మహానగరంలో తొలి రాజకీయ సభకు హాజరవుతున్నారు. ప్రియాంక పర్యటనకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కేవలం ఒకటిన్నర గంటలు మాత్రమే.. రాష్ట్రంలో ఉంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రేపు సాయంత్రం 3.30 గంటలకి మధ్య బెంగళూరునుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రియాంక చేరుకుంటారు.
యువ డిక్లరేషన్ ప్రకటన..(Priyanka Gandhi)
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్బీ నగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. పీసీసీ యువ సంఘర్షణ సభలో పాల్గొంటారు. ప్రియాంక చేతుల మీదుగా యువ డిక్లరేషన్ ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్న తీరుపై ప్రసంగించనున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత కోసం ఏం చేస్తారో ఈ సభ ద్వారా ప్రియాంక స్పష్టం చేయనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ప్రస్తావిస్తారని తెలుస్తోంది. వరంగల్ సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించగా.. ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ యువ డిక్లరేషన్ ప్రకటిస్తారు.
https://youtu.be/1C5OevuZ5Dk