Preeti: పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి అంత్యక్రియలు తన స్వగ్రామమైన గిర్ని తండాలో పూర్తయ్యాయి. ఐదు రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూసింది. బంధువులు, స్థానికులు ప్రీతికి కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా గిర్ని తండా కన్నీరుమున్నీరుగా విలపించింది.
స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు (Preeti)
ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ప్రీతి ఆదివారం కన్నుమూసింది. ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ అంతిమయాత్రలో వివిధ పార్టీలకు చెందిన నేతలు.. ఇతరులు పాల్గొన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రీతి మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రీతి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రీతి ఇంటి సమీపంలోని వారి వ్యవసాయ పొలంలో అంత్యక్రియలను పూర్తి చేశారు.
ప్రీతి తండ్రి సంచలన వ్యాఖ్యలు..
ప్రీతి మృతిపై ఆమె తండ్రి నరేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిని హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇదే కోణంలో పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రీతి మృతికి గల కారణాలను పూర్తిగా తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రీతికి సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడని నరేంద్ర ఆరోపించారు. ప్రీతి హత్యకు ముందు నుంచే ప్లాన్ చేశారని ఆరోపించారు. తమ కూతురు మృతికి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిమ్స్‌లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత
ప్రీతి మరణించిందని వైద్యులు తెలపగానే ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి వరకు హై డ్రామా కొనసాగింది. కాకతీయ మెడికల్ కళాశాల అనస్థీషియా విభాగం హెచ్‌వోడీని సస్పెండ్ చేయాలని.. సస్పెండే చేసిన తర్వాతనే మృతదేహన్ని తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు. ప్రీతి మృతిపై సమగ్ర నివేదిక కావాలని తండ్రి నరేందర్ అన్నారు. మరణానికి గల కారణాలను వివరిస్తేనే.. మృతదేహాన్ని తీసుకువెళ్తామని పట్టుబట్టారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేయగా.. కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ఐసీయూ గ్లాస్ డోర్‌ను బద్దలుకొట్టారు. ప్రీతి కి చెందిన కొందరు బంధువులు.. అంబులెన్స్‌కి అడ్డుపడటంతో పాటు తాళం లాక్కున్నారు. దీంతో కొందరిని వాహనాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో.. ప్రీతి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. ప్రీతి మృతదేహాన్ని ప్యాక్ చేసి పంపుతాం అని ఓ వైద్యుడు అనడం చర్చనీయంశంగా మారింది. దీనిపై బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ పరీక్ష నిర్వహించేందుకు గాంధీలో వైద్యులు ఏర్పాట్లు చేశారు.
ప్రీతి కుటుంబానికి ఆర్ధిక సాయం..
ప్రీతి మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రీతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రూ. 10 లక్షలతో పాటు.. మరో రూ. 20 లక్షలను ఆర్ధిక సాయం ప్రకటించేలా చూస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రీతి మృతిపై పలువురు నేతలు స్పందించారు. ప్రీతి మృతి.. తన మనసును తీవ్రంగా కలిచివేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు సంతాపం ప్రకటించారు.
ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు. ప్రీతి మృతిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షర్మిల సైతం సంతాపం తెలిపారు. హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు సైతం హామీ ఇచ్చారని చెప్పారు. ర్యాగింగ్ కు నిరసనగా సోమవారం వైద్య, విద్యాసంస్థల రాష్ట్ర బంద్‌కు ఏబీవీపీ తెలంగాణ పిలుపునిచ్చింది.