PM Modi Telangana Tour:తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయింది. ఈనెల 30, వచ్చేనెల మే 3, 4 తేదీల్లో మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు . ఈనెల 30న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగసభకి మోదీ హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో సభకి నరేంద్ర మోదీ హాజరవుతారు. మేన 4న మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజక వర్గం నారాయణ పేటలో నిర్వహించే సభ, వికారాబాద్ లో జరిగే బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు.
ఈ సారి పార్లమంటు ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ నిర్ణయించుకుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పదేళ్లపాటు తెలంగాణలో తిరుగులేని అధికారం చలాయించిన బీఆర్ఎస్ పార్లమంటు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే పరిస్దితి కనపడలేదు. బీఆర్ఎస్ నుంచి పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇబ్బందులు పడటం, ప్రస్తుతం ఉన్న కరువు పరిస్దితులు తమకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ అభివృద్ది బీజేపీతోనే సాధ్యమని చెప్పుకుంటూ మోదీ ఇమేజ్ తో దూసుకువెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీనితో దక్షిణాదిన కర్ణాటకతో పాటు తెలంగాణలో గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలుచుకోవడానికి బీజేపీ వ్యూహరచన చేస్తోంది.