Janasena chief Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది రైతాంగం, యువత, ఆడపడుచులు నిర్ణయించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నా వద్ద వేలకోట్లు లేవు. సుపారీ గ్యాంగులు లేవు. ఒక్క ఎమ్మెల్యే, వారి వద్ద ఉన్న గూండాలు ఇన్ని కోట్ల మందిని భయపెడుతున్నారు. సమాజంలో పెరిగిపోతున్న పిరికితనం మీద పోరాటం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎంపీని కొట్టించగలడు. ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే శభాష్ అంటారు. అంబేద్కర్ కోనసీమ పేరు పెట్టినపుడు అభిప్రాయసేకరణ చేయాలి. వారిని ఒప్పించాలి. అలా కాకుండా కులాల మధ్య చిచ్చు పెట్టేలా చేసారు. నాయకుడు అంటే ప్రజలను కలపాలి విడగొట్టగూడదు. వైసీపీ అంటే ప్రజలను విడదీసే పార్టీ. కోనసీమలో శెట్టి బలిజలు, కాపులకు పడదంటే నేను అందరికీ ఆత్మీయ సదస్సులు పెట్టించాను. కోనసీమ అద్బుతంగా ముందుకు వెళ్లాలంటే బాలయోగి లాంటి వ్యక్తులు ఉన్నారు.నా కడ శ్వాస వరకు అభివృద్దిని సాదించేవరకు విశ్రమించను అని పవన్ అన్నారు. 100 మంది కష్టాన్ని 30, 40 మందికి పంచుతున్నారని విమర్శించారు.
రైతును పంటలకు ఇన్పూరెన్స్ కట్టనివ్వక తాను కట్టక ఇబ్బందులు పెట్టారు. రైతు పండించిన ప్రతీ బస్తా ద్వారంపూడి కుటుంబానికి వెడుతుంది. అన్నం పండించే రైతు కన్నీరు పెడుతుంటే కష్టాన్ని అడ్డంగా దోచేస్తున్నారు. ఈ ద్వారంపూడి కుటుంబం ద్వారా జగన్ చేస్తున్నారు. మీ నోటికి వస్తే ఎలా అయినా మాట్లాడుతారు. డబ్బులు, గూండాలు ఉన్నారనా? బలిసి కొట్టుకుంటున్నారు. ఒక కులం పేరుతో అమరావతి రైతులను, ఒంటరి మహిళలను బెదిరించవచ్చు. కాని నేను కులాల గురించి మాట్లాడుతుంటే వైసీపీ నాయకులకు కష్టంగా ఉంది. రెండు కులాలు మాత్రమే బాగుండాలి అంటే కుదరదు. కష్టం రైతులది అయితే లాభం పొందుతున్నది ద్వారంపూడి కుటుంబానిది. నేను ఓడిపోయినా నిలబడాలనే ఈ క్రిమినల్ గ్యాంగ్ తో గొడవ పెట్టుకుంటున్నాను. నాకు గతంలో వై క్యాటగిరీ సెక్యూరిటీ ఇస్తానంటే వద్దని పంపేసాను. వారాహి తల్లి నాకు రక్ష. రైతు భరోసా కేంద్రాలని చెప్పి మభ్య పెడుతున్నారు. అక్కడ రైతులకు కావలసిన ఏ వ్యవస్ద ఉండదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
జనసేన ప్రభుత్వం వస్తే రైతు భరోసా కేంద్రాలు రైతుకు నిజంగా భరోసా ఇచ్చేలా చేస్తాము. దగ్గరగా ఉండే మిల్లులకే ధాన్యం పంపేలా ఏర్పాటు చేస్తాము. ఉభయగోదావరి జిల్లాలకు జనసేన, నేను అండగా ఉంటాము. రాజకీయం చేయాలంటే పెట్టిపుట్టనక్కరలేదు. గుండె దైర్యం ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ కు వైసీపీ అనే తెల్లదోమ పట్టి పీడిస్తోంది. కోనసీమలో మంచి ఆసుపత్రి కూడాలేదు. తాగునీటి సమస్యలు ఉన్నాయి. కాలువల్లో పూడికలు తీయడంలేదు. మూడు పంటలు పండాల్సిన భూమి ఒక పంటకే పరిమితమయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ముఖ్యమంత్రి కేసులు గురించి తప్పించుకోవాలని భావిస్తాడు తప్ప మరేదాని గురించి ఆలోచించడు. ఇసుక అంతా ముగ్గురు దోచేస్తున్నారు. ధాన్యం అంతా ఒక కుటుంబం దోచేస్తోంది. నేను దెబ్బతిన్నా పారిపోను. కాని మీరు నష్టపోతారు. నేను వస్తున్నానంటే హడావుడిగా ధాన్యం కొనేసారు. ఒక్కసారి నన్ను నమ్మండి. నాకు అధికారం ఇవ్వండి. మనమందరం ఆంధ్రులం అని భావన లేకపోతే నష్టపోతాము. ఎవరి కులాలను వారు గౌరవించుకుంటూ ఐక్యంగా ఉండాలి. సినిమాల పరంగా మీ ఇష్టాన్ని రాజకీయాల మీద చూపకండి. 75 శాతం మంది వైసీపీ అంటే ఇష్టంలేకుడా ఉన్నారు. అందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.