AP Cabinet Meet: సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సామాజిక పెన్షన్లని 2వేల 750 రూపాయల నుంచి మూడు వేల రూపాయలకి పెంచుతూ కేబినెట్ అంగీకారం తెలిపింది. జనవరి 1నుంచి వీటిని పంపిణీ చేస్తారు.వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పధకాల అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మిచౌంగ్ తుఫాన్ నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.జగనన్న ఆరోగ్య సురక్ష రెండోవిడతకు కూడా కాబినెట్ ఆంగీకారం తెలిపింది. కేబినెట్ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందుగానే జరిగే అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. శుక్రవారం జరిగిన కాబినెట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఈ సారి 20 రోజులు ముందుగానే వెలువడే అవకాశముందని సీఎం జగన్ చెప్పారు. ఎన్నికలు సిద్దంగానే ఉన్నామని అయితే క్షేత్ర స్దాయిలో మంత్రులు మరింత కష్టపడవలసిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేక మీడియా చేసే ప్రచారాన్ని సమర్దవంతంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉందన్నారు. అంతకుమందు కాబినెట్ సమావేశం జరగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారన్ని వార్త తెలియడంతో రెండు నిమషాలు మౌనం పాటించారు.