Pedana Farmers: కృష్ణా జిల్లా పెడన రైతులను అధికారులు నట్టేట ముంచారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి అసలు బాధిత రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లో పంట నష్టపరిహారం డబ్బులను జమ చేశారు. రైతులను నిండా ముంచిన ఈ వ్యవహారం తాజాగా బట్టబయలైంది.
వ్యవసాయశాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా నియమితుడయిన వ్యక్తి ఈ తతంగాన్నంతా నడిపించినట్లు తెలిసింది. మొత్తం 3 కోట్ల, 72 లక్షల రూపాయల స్కాం వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తోంది. ఫేక్ అకౌంట్లు సృష్టించి సుమారు 4 కోట్ల రూపాయలను గోల్ మాల్ చేసిన వ్యవహారం రైతులకు తెలియడంతో వారంతా ఏకమై ఏవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి ఏవో శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తమకు న్యాయం చేయాలని లేకపోతే కోర్టు మెట్లు ఎక్కుతామని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.