Paritala Sunitha Sensational Comments On YS Jagan: మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసు విషయంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేశారు. ఆయనను అదే రోజు సీబీఐ విచారణ చేసినట్లు గుర్తు చేశారు.
అనంతపురంలోని అరవింద నగర్‌లోని తన నివాసంలో ఆమె మాట్లాడారు.సూట్ కేస్ బాంబు కూడా ఎవరు పెట్టారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారంతా కారు బాంబు గురించి ఎందుకు ప్రస్తావించరని నిలదీశారు. కొంతమంది తమ స్వార్థం కోసం రెచ్చగొడుతున్నారని పరిటాల సునీత తెలిపారు.
ఈ కేసులోకి కనుముక్కల చెన్నారెడ్డి, మద్దలచెరువు సూరి కుటుంబాలను లాగి తోపుదుర్తి సోదరులు లబ్ది పొందాలని చూస్తున్నారని ఆమె వివరించారు. గంగుల భానుమతి, కనుముక్కల ఉమాకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్షన్ కారణంగా మన మూడు కుటుంబాలు నష్టపోయాయని, మన కుటుంబాలు దీని నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని చెప్పారు.
ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న సమయంలో తోపుదుర్తి సోదరులు మళ్లీ ఇందులోకి లాగుతున్నారని తెలియజేశారు. వారి మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వామ్యం కావద్దని ప్రతి ఒక్కరికీ ఆమె సూచించారు. ఫ్యాక్షన్‌ను రెచ్చగొట్టి చలి కాచుకోవాలని తోపుదుర్తి సోదరులు చూస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. పాపంపేటలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇళ్లు కూల్చివేశారని గుర్తు చేశారు.
ఇది జరిగిన మూడు రోజుల తర్వాత తోపుదుర్తి సోదరులు బాధితులను రెచ్చగొడుతున్నారని ఇది మంచి సంప్రదాయం కాదని చెప్పారు. మా కుటుంబం ఇచ్చే కుటుంబం కానీ తీసుకునేది కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎంపీపీ ఎన్నిక విషయంలో నేను జోక్యం చేసుకోలేదని, అలా చేసుకొని ఉంటే ఖచ్చితంగా రామగిరి ఎంపీపీ టిడిపి వశమయ్యేదని తెలియజేశారు.
ఇదిలా ఉండగా, ఎంపీటీసీల మీద నమ్మకం లేకనే క్యాంపులకు తరలించారని, తోపుదుర్తి చందు గతంలో చంద్రబాబు, లోకేష్‌లపై ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందేనని చెబుతూ ఆ వీడియోను చూపించారు. తోపుదుర్తి సోదరులు ఇచ్చిన స్ర్కిప్ట్ జగన్ చదువుతున్నారని, ఐదేళ్లు సీఎంగా చేసిన మీరు తెలుసుకోరా అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు. ఇక్కడ లింగమయ్య తో పాటు మీ పార్టీ బాధితులను కూడా పరామర్శించాలని కోరారు . తోపుదుర్తి బ్రదర్స్ వల్ల ఐదేళ్లలో మీ పార్టీ వారు చాలామంది నష్టపోయారని వారిని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని చురకలంటించారు . ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో జగన్ వచ్చి ఫ్యాక్షన్ రగిలించవద్దని సూచించారు.