Foam with chemicals:హైదరాబాద్ లో మంగళవారం ఉదయం నుండి కురిసిన వర్షానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్‌లో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. దీనితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షపునీటితో పాటు పక్కనే ఉన్న నాలానుండి పెద్ద ఎత్తున కెమికల్స్‌తో కూడిన నురగ.. వరద నీటితో కలిసి ఇండ్లలోకి చేరింది. ఆ వాసనతో కాలనీవాసులు నరకయాతన అనుభవించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో ఇలానే తాము నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంటుందని అసహనం వ్యక్తం చేశారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వస్తోంది. రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లో వరద పోటెత్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండింటిలో ఆరు గేట్లను ఎత్తారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పూర్తిగా నిండు కుండలా మారడంతో నీటిని దిగువకు వదిలారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రవి కుమార్ సూచించారు.
మరోవైపు మంచిర్యాల జిల్లా పెగడపల్లి వాగులో వరద ఉధృతి పెరగడంతో లో లెవల్ వంతెన వద్ద వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో అవతలి వైపు ఉన్న 24 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అప్పటికీ నీటిలో వెళ్తున్న బొలెరో వాహనం వరదలో చిక్కుకుంది. గ్రామస్థులు వాగు దాటడానికి నానా అవస్థులు పడుతున్నారు. ఎంతమంది నాయకులు వచ్చినా బ్రిడ్జ్ కట్టరు కానీ ఓట్లు మాత్రం అడుగుతారని మండిపడుతున్నారు.మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామం వద్ద గల గొర్రె గట్టు వాగు వద్ద నీరు చేరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో మూడు గ్రామాల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. నక్కలపల్లి, బ్రాహ్మణపల్లి, చామనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.