Orange Alert: గత కొద్ది రోజులుగా ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో.. రాష్ట్రంలో మరో మూడు రోజులు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మూడురోజులపాటు వానలు..(Orange Alert)
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని తెలిపింది. నిజాంపేట, బాచుపల్లి,ప్రగతి నగర్, షాపూర్ నగర్, జీడిమెట్ల, సూరారం,చింతల్ ,గండి మైసమ్మ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్డు జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముధోల్ లో 129మిల్లీమీటర్లు, భైంసాలో 115 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. మంచిర్యాల జిల్లా కుందారం 87.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మరోవైపు ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో పెరగడంతో ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.