Prime9

Monsoon Season: కనిపించని వానలు.. పెరుగుతున్న ఎండలు

No Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ప్రతి ఏడుకంటే ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తెలుగు రాష్ట్రాల్లోకి కూడా అదే జోరుతో వ్యాపించాయి. రుతుపవనాలు వచ్చిన రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడ్డాయి. దీంతో ఈ ఏడాది వర్షాలు బాగానే పడతాయని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. వానలు కురవడం మాట పక్కన పెడితే.. ఎండలు మాత్రం రోజురోజుకు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు వేడి గాలులు సైతం వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 

ఇక ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో వర్షం జాడ లేకుండా పోయింది. నిన్న పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం చెప్పింది. ముఖ్యంగా ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోతతో పాటు 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

మరోవైపు తెలంగాణలో కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. వచ్చే కొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది.

Exit mobile version
Skip to toolbar