Liquor Sales: తెలంగాణలో ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆబ్కారీ శాఖ పంట పండింది. ఒక్కరోజే మద్యం ప్రియులు దుమ్ము లేపారు. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 313 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 625 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్‌కి అనుమతి ఇవ్వడం, బార్లను ఒంటిగంట వరకూ తెరచి ఉంచడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్ 28న 133 కోట్లు, 29న 179 కోట్లు, 31న అత్యధికంగా 313 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.ఈ సారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నంనుంచే వైన్ షాపుల వద్ద రద్దీ కనిపించింది. మూడు రోజుల్లో లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో 658 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు సమాచారం. మొత్తంగా 3 రోజుల్లో 4కోట్ల 76 లక్షల లిక్కర్ కేసులు… 6కోట్ల 31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఈ మూడు రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో 2023లో విక్రయాలు తారాస్థాయిలో జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 210 మద్యం దుకాణాలు, 50 బార్లు, మూడు క్లబ్బులున్నాయి. ఆయా మద్యం దుకాణాలకు వైరాలోని మద్యం డిపోనుంచి సరకును విక్రయిస్తుంటారు. ఈ ఏడాది జనవరినుంచి డిసెంబర్ వరకు 2 వేల 277 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని వ్యాపారులు డిపోనుంచి కొనుగోలు చేశారు. డిపోనుంచి వ్యాపా రులకు మద్యాన్ని ఇన్వాయిస్ ధరపై కేటాయిస్తారు. ఈ మద్యానికి వ్యాపారులు ఎమ్మార్పీ ధరను జోడించి విక్రయించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్వాయిస్‌తో కొన్న 2వేల 277 కోట్ల మద్యానికి ఎమ్మార్పీ ధరని జోడిస్తే వీటి విలువ 2వేల 700 కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.