Home Guard Ravinder’s wife: హోంగార్డు రవీందర్ మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తని డిపార్ట్‌మెంట్ వాళ్ళే తగులబెట్టారని సంధ్య ఆరోపించారు. ఘటనకి సంబంధించిన సిసి ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ ఫోన్‌ని అన్‌లాక్ చేసి డేటా డిలిట్ చేశారని అన్నారు.
ఎఎస్ఐ నర్సింగరావు, కానిస్టేబుల్ చందుని ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య ప్రశ్నించారు. కానిస్టేబుల్ చందు, ఏఎస్ఐ నర్సింగరావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సంధ్య ఉస్మానియా అసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు ఉస్మానియాకు చేరుకుని సంధ్యకు సంఘీభావం తెలిపారు. రవీందర్ మృతి వెనుక కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేసారు.
మరోవైపు ఆత్మహత్యకి పాల్పడిన హోంగార్డు రవీందర్ మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి 306 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ వన్‌గా కానిస్టేబుల్ చందు, ఏ టూగా ఏఎస్ఐ నర్సింగరావు పేర్లని చేర్చారు. జీతం గురించి అడిగితే ఏఎస్ఐ, కానిస్టేబుల్ అవమానించారని రవీందర్ మరణ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఆత్మహత్యకి ప్రేరేపించారంటూ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.