MP Kalisetty Appalanaidu: విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బీసీ హాస్టల్ లో నిద్రించారు.ఎంపీగా ఎన్నికైన కొద్దీ రోజులలోనే ఇలా ఓకే బిసీ హాస్టల్ లో నిద్రించడం ఆసక్తిగా మారింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మెట్టవలసలోని ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్‌ను గురువారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులు, గ్రామస్థులతో ముచ్చటించి విద్యా బోధన, హాస్టల్లోని వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి గురువారం రాత్రి హాస్టల్లోనే నిద్రించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఆయన అన్ని ప్రభుత్వమే చూసుకోవాలని కాకుండా స్థానికులు సైతం కొంత చొరవ చూపి హాస్టల్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో చాల మంది గొప్ప వారు అవుతారని.. బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.
మెట్టవలసలోని ప్రభుత్వ బాలుర BC హాస్టల్ శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం విజయనగరం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. పైగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుది కూడా శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలంకి పొరుగున ఉన్న రణస్థలం మండలమే. మెట్టవలసలోని ఇదే హాస్పిటల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. దీంతో ఒక్కసారి తాను గతంలో చదువుకున్న హాస్టల్‌ను సందర్శించి అక్కడి అవసరాల్ని తెలుసుకోవాలని కుతూహలంతో సందర్శించారు. మొత్తానికి ఇలా ఎంపీ అయ్యారో లేదో అప్పుడే ఆకస్మిక తనిఖీలు, రాత్రి నిద్రలు చేయటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .