MLA Tatikonda Rajaiah: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ బిఆర్ఎస్ పాలిటిక్స్ హీటెక్కాయి. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. పార్టీ టికెట్ లభించకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆరు నూరైనా ప్రజా జీవితంలోనే ఉంటానని రాజయ్య తాజాగా ప్రకటించారు.
దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు..(MLA Tatikonda Rajaiah)
పంట పండించి రాశి పోసిన తరువాత ఎవరో వస్తా అంటే ఊరుకుంటానా? అని రాజయ్య ప్రశ్నించారు. రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు.
దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు. ప్రజల కోసమే నేనున్నా ప్రజల మధ్యలోనే చచ్చిపోతానంటూ రాజయ్య వ్యాఖ్యానించారు. కాయలున్న చెట్టుకే దెబ్బలు తగులుతాయని ఇది సహజమన్నారు. నాలుగు రోజులకిందట సీఎం కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్దుల జాబితాలో రాజయ్య పేరు లేదు. రాజయ్యకు బదులుగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గం నుంచి కడియం శ్రీహరిని ఎమ్మెల్యే అభ్యర్దిగా ప్రకటించారు. దీనితో రెండు రోజులకిందట కార్యకర్తల సమక్షంలో రాజయ్య కన్నీరు పెట్టారు. అయితే కేసీఆర్ చెప్పినట్లు నడుచుకుంటానని అన్నారు. ఈ నేపధ్యంలో రాజయ్య తాజా వ్యాఖ్యలను చూస్తే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి మొదలయింది.