Janakipuram Sarpanch Navya: వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో నిత్యం వార్తల్లో ఉండే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్ళీ తెరకెక్కారు. ఎమ్మెల్యే రాజయ్య తనని లైంగికంగా వేధించారని గతంలో సంచలన ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య మళ్ళీ మీడియా ముందుకి వచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే రాజయ్య సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఇప్పుడు సర్పంచ్ నవ్య మరోసారి రాజయ్యపై ఆరోపణల అస్త్రాలు ఎక్కుపెట్టారు. భర్తతో తనని వేరు చేయాలని ఎమ్మెల్యే రాజయ్య ప్రయత్నిస్తున్నారని నవ్య ఆరోపించారు.
సంతకం చేయమని వత్తిడి చేస్తున్నారు..(Janakipuram Sarpanch Navya)
తాను అమ్ముడుపోయానని ప్రచారం చేస్తున్నారని నవ్య మండిపడ్డారు. కొంతమంది బలవంతం చేయడంవల్ల ఎమ్మెల్యే రాజయ్యని క్షమించానని, తనపై చాల పెద్ద నింద వేశారని నవ్య అంటున్నారు. జానకీపురానికి 25 లక్షల రూపాయల నిధులు ఇస్తా అన్నారని నవ్య గుర్తు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మరో మహిళతో కలిసి తన భర్తను ట్రాప్ చేస్తున్నారని నవ్య తెలిపారు. నిధుల కోసం వెళ్తే తన భర్తను అగ్రిమెంట్ చేసుకొమ్మని బలవంతం చేస్తున్నారని నవ్య వెల్లడించారు. 25 లక్షల రూపాయల అప్పు తీసుకున్నట్లు తనని సంతకం చేయమంటున్నారని నవ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంతకం చేయమంటూ తన భర్త కూడా ఒత్తిడి చేస్తున్నారని నవ్య వాపోయారు. తన భర్తని, తనని విడదీయాలని చూస్తున్నారని, ఏదో ఒక కేసులో తనని ఇరికిద్దామని చూస్తున్నారని నవ్యం ఆందోళన వ్యక్తం చేశారు.