Tulja Bhavani Reddy:జనగామ పోలీసు స్టేషన్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి చేరుకున్నారు. తన విధులకి ఆటంకం కలిగిస్తోందంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గతంలో పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో తుల్జా భవాని రెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. అంతేకాకుండా రెండ్రోజుల క్రితం సిఆర్పిసి సెక్షన్ 160 కింద భవాని రెడ్డి బంధువు శివ రామకృష్ణకు నోటీసులు ఇచ్చారు. శివరామకృష్ణకు నోటీసులు ఎందుకు ఇచ్చారని పోలీసులకు ఆమె ప్రశ్నించింది.
ఫోర్జరీ చేసారని ఆరోపణలు..(Tulja Bhavani Reddy)
గత నెలలో సంతకాన్ని ఫోర్జరీ చేశావంటూ తుల్జా భవాని రెడ్డి తన తండ్రి, ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిని నలుగురిలో నిలదీసింది.నీపై ఇప్పటికే ఓ కేసు పెట్టా.. ఇంకో కేసు కూడా పెడుతున్నానంటూ తండ్రి ముత్తిరెడ్డిని కూతురు తుల్జా భవాని రెడ్డి హెచ్చరించారు. తనకి ఇష్టం లేకున్నా చేర్యాలలో భూమి కొన్నారని, ఆ డాక్యుమెంట్లలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తుల్జా భవానీ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నింట్లో తన తండ్రి ఇరికించారని తుల్జా భవాని రెడ్డి అన్నారు.ప్రజాప్రతినిధులు,అధికారుల ముందే భూములకు సంబంధించి తన తండ్రిని ఆమె ప్రశ్నించింది.
అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రాజకీయ ప్రత్యర్థులే తన కూతురిని తప్పుదోవ పట్టించి ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యను రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని ముత్తిరెడ్డి అన్నారు. నాది కుటుంబ సమస్య.కుటుంబ సమస్యను రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారు.మానసికంగా నా మనోధైర్యం దెబ్బతీయడం కోసం కుట్రలు చేస్తున్నారు.ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన జనగామలో మళ్లీ గెలుస్తాను. నా కూతురు అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకుని ఆడిస్తున్న డ్రామా ఇదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల తన విధులకు ఆటకం కలిగిస్తుందంటూ కూతురు భవాని రెడ్డిపై యాదగిరి రెడ్డి పోలీసులకు ఫిర్యాధు చేసారు.