Minister KTR: హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్‌కి బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో కొత్త సంస్కృతికి తెర తీశారని కెటిఆర్ అన్నారు. ఇదే పరిస్థితి వారు కూడా ఎదుర్కోవల్సి వస్తుందని కెటిఆర్ హెచ్చరించారు. డిసెంబర్ 3 తరువాత మళ్ళీ తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని, కఠిన చర్యలు తప్పవని కెటిఆర్ చెప్పారు.
ఏం జరిగిందంటే..(Minister KTR)
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని.. వారిని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దాంతో మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో.. కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు కృష్ణ వారిని అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, బీఆర్ఎస్ నేతలు ఆయనపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కావడంతో.. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు.