CM Breakfast Scheme: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని వెస్ట్ మారేడుపల్లిలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) శుక్రవారం ప్రారంభించారు.విద్యార్థులను పలకరించిన కేటీఆర్ డైనింగ్ హాల్‌లో వారితో కలిసి అల్పాహారం చేశారు. బ్రేక్‌ఫాస్ట్ మెనూలో సాంబార్, పూరీ మరియు ఆలు కుర్మా, ఉప్మా మరియు చట్నీ మరియు కేసరి స్వీట్‌తో కూడిన ఇడ్లీ ఉన్నాయి.
23 లక్షలమంది విద్యార్దులకు..(CM Breakfast Scheme)
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌లో విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 27వేల 147 పాఠశాలల్లో ప్రారంభించారు. స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్ఫాహారాన్ని వడ్డించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా, మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా అల్పాహారాన్ని అందజేశారు.ఈ పథకంతో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది.
ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకాన్ని మొదట తమిళనాడులో ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ పథకాన్ని రాష్ట్ర ఐఏఎస్ అధికారుల బృందం అధ్యయనం చేసింది. తమిళనాడులో 1నుంచి 5 తరగతుల విద్యార్థులకే అల్పాహారాన్ని అందిస్తుండగా.. తెలంగాణాలో 1 నుంచి 10 తరగతి విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.