Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయం లగేజీ స్క్రీనింగ్ అధికారులు ఓ వ్యక్తి తీసుకువచ్చిన లగేజీని పరిశీలించి అవాక్కయ్యారు. క్షుద్రపూజల కోసం కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలను అతడు తరలిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు సీఐఎస్‌ఎఫ్ అధికారులు గుర్తించారు. తెల్లవారు జామున సయ్యద్ అక్బర్ పాషా అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.
క్షుద్ర పూజల కోసం..(Shamshabad Airport)
లగేజీ స్క్రీనింగ్‌లో అనుమానిత వస్తువులు కనిపించడంతో సీఐఎస్‌ఎఫ్ అధికారులు వాటిని పరిశీలించారు. కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా క్షుద్ర పూజల కోసం వాటిని తీసుకెళుతున్నట్లు చెప్పాడు. కస్టమ్స్ అధికారులు అతడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే దానిపై దర్యాప్తు చేపట్టారు. కస్తూరి పిల్లి శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కస్తూరి పిల్లి అవయవాలను సుగంధ పరిమళాల ఉత్పత్తుల తయారీలో.. కొన్ని రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది.