Loan for Dead Person: బ్యాంక్ రుణం కావాలంటే అధికారులు పలు షరతులు విధిస్తారు. అవసరమైన డాకుమెంట్స్ అన్నీ అందించాలని కోరుతారు. ఆ తర్వాత వెరిఫికేషన్ పూర్తి చేసి లోన్ మంజూరు చేస్తారు. కానీ అందుకు విరుద్ధం గా మృతి చెందిన వ్యక్తికి బుల్లెట్ బండికి కొటాక్ మహీంద్రా బ్యాంక్ లోన్ మంజూరు చేసింది. ఈఎమ్ఐ చెల్లించాలని ఖమ్మం బ్రాంచ్ కు చెందిన బ్యాంక్ అధికారులు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన భూక్య సునీత, నగేష్ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాకేష్ 2022 జనవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖమ్మం బ్రాంచ్ అధికారులు గత ఏడాది అక్టోబర్ 18న భూక్య రాకేష్ పేరు మీద రాయల్ ఎన్ ఫీల్డ్ -350 బుల్లెట్ బండికి సుమారు 3 లక్షల రుణం మంజూరు చేశారు. నెలకు 7,150 రూపాయల చొప్పున 48 నెలలపాటు కిస్తీ లు చెల్లించాలని షరతు విధించారు. ఈ మేరకు మూడు వాయిదాలు చెల్లించాడు. ఆ తరువాత వాయిదాలు చెల్లించకపోవడంతో రుణం రికవరీ కోసం కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్, వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు చేరుకున్నారు. వాయిదా బకాయి డబ్బులు చెల్లించాలని కుటుంబ సభ్యులను కోరడంతో వారు షాక్ తిన్నారు.
చనిపోయిన వ్యక్తికి లోన్ ఎలా ఇచ్చారు? (Loan for Dead Person)
రెండున్నరేళ్ల క్రితం మృతిచెందిన తమ కుమారుడికి రుణం ఎలా ఇచ్చారని కుటుంబ సభ్యులు, స్థానికులు కొటక్ మహీంద్ర బ్యాంక్ సిబ్బందిని నిలదీశారు. తన కుమారుడి పేరు మీద లోన్ తీసుకున్న వ్యక్తి వివరాలు తెలియజేసే వరకు ఇక్కడ నుంచి కదలనియ్యమని చుట్టుముట్టారు. రుణం తీసుకుని ఇలా ఎందుకు బుకాయిస్తున్నారని బ్యాంక్ ఉద్యోగులు ప్రశ్నించారు. చనిపోయి రెండున్నరేళ్లు అవుతుందని చెప్పితే అర్థంకావడం లేదా..? అంటూ స్థానికులు బ్యాంక్ ఉద్యోగులను మందలించారు. పోలీసులకు సమా చారం అందించి ఉద్యోగులను అప్పగించారు. మృతి చెందిన తన కుమారుడి పేరిట రుణం మంజూర చేసిన అధికారులు, తీసుకున్న వ్యక్తి, దళారులను గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరారు.