Shamshabad Airport:హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి చిరుత చొరబడడంతో కలకలం రేగింది. గొల్లపల్లి వైపు నుంచి ప్రహరీగోడ దూకి చిరుత ఎయిర్‌పోర్టు లోపలికి వచ్చిందని తెలుస్తుంది .ఏప్రిల్ 28 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది . చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది.దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత కదలికలు కనిపించాయి. వెంటనే ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతను పట్టుకునేందుకు ట్రాప్‌లు, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఖంగారు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
రన్‌వే, ప్యాసింజర్ టెర్మినల్ భవనం వైపు అది రాకుండా టపాసులు కాల్చారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో వచ్చే శబ్దాలకు భయపడి చిరుత బయటకు వెళ్లిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గొల్లూర్ రిజర్వ్ ఫారెస్టు విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండడంతో అక్కడి నుంచి అడవి జంతువులు ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 1,500 ఎకరాల విస్తీర్ణంలో రన్‌వే వుంది . దీనిలో సగానికిపైగా ఖాళీగా ఉండడంతో చెట్లు బాగా పెరిగి చిట్టడవి ని తలపిస్తుంది .దింతో చిరుత అటువైపు వెళ్లి ఉండవచ్చని.. విమానాశ్రయం సమీపంలోని ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.