Minister Botsa Satyanarayana: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని విద్యావ్యవస్థను తెలంగాణతో పోల్చడం సరికాదని, రోజూ అనేక కథనాలు, కుంభకోణాలు కనిపిస్తున్నాయన్నారు. టీచర్లను కూడా బదిలీ చేయలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి అని బొత్స వ్యాఖ్యానించారు.
విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదని బొత్స అన్నారు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామని బొత్స వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణదిని బొత్స విమర్శించారు.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోకుంటే మంచిది. ఇంత పొద్దున్నే ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నావు అంటూ అసహనం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందుగా పవన్ తెలుసుకోవాలని బొత్స కోరారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్దపై విషం చిమ్ముతున్నారని బొత్స ఆరోపించారు.
ఇలా ఉండగా బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసునని అన్నారు. బొత్స అలా మాట్లాడడం సరికాదని.. హైదరాబాద్ రాకపోతే కాలక్షేపం చేయలేరని అన్నారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మంత్రి మండిపడ్డారు.రాజధాని కూడా లేని రాష్ట్రం.. అలా మాట్లాడడం సరికాదు.. ఏపీపీఎస్సీలో గతంలో ఎన్ని స్కానింగ్ లు జరిగాయో పరిశీలించాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు.