Lavanya Drugs Case: లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. షార్ట్ ఫిల్మ్‌లో నటించే లావణ్య మత్తుకు బానిస అయి చివరికి పోలీసులకు పట్టుబడింది. ఏపీలోని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య చదువుకోసం హైదరాబాద్ వచ్చింది. గండిపేట మండలం కోకాపేటలో సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది.
కస్టడీలోకి తీసుకోవాలని..(Lavanya Drugs Case)
అక్కడ మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నించేది. ఈ క్రమంలో స్నేహితుడు శేఖర్‌రెడ్డి ద్వారా నార్సింగిలో నివాసముండే ఉనీత్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఉనిత్ బెంగళూరులో ఎండీఎంఏ డ్రగ్స్‌ను గ్రాము 15 వందలకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో 6 వేలకు విక్రయించేవాడు. నార్సింగిలోని అతని నివాసంలో అతని ప్రియురాలు ఇందిర, లావణ్యలు డ్రగ్స్ తీసుకునేవారు. వీరిద్దరిని ఉనీత్ ఎండీఎంఏ సరఫరాకు వినియోగించేవాడు. గత ఏడాది ఉనీత్‌తో పాటు లావణ్యపై కూడా కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న లావణ్యను కోకాపేటలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభ్యమయ్యాయి. లావణ్య మొబైల్‌తో పాటు, సోషల్‌మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్‌ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్‌లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్‌ను ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. నిందితురాలి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.