KTR Comments: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అలవిగానీ హామీలు ఇచ్చారని, ఇద్దరినీ తాము ఎందుకు వదిలి పెడతామని మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలా నడుపుతారో చూస్తాన్న కేటీఆర్ అసలు ఆట ఇప్పుడు మొదలవుతుందని అన్నారు. అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుందని కేటీఆర్ విమర్శించారు. తాము చేసిన ప్రతి అప్పుకి లెక్కలున్నాయి.ఆడిట్ రిపోర్టులున్నాయని కెటిఆర్ వివరించారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతిదీ రికార్దయి ఉంటుందని కెటిఆర్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారని, పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తామన్నారని, తొలి కేబినెట్ భేటీలోనే ఆరు గ్యారెంటీలకి చట్టబద్ధత కల్పిస్తామన్నారని అవి ఏమయ్యాయని కెటిఆర్ ప్రశ్నించారు. రుణ మాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో తమకి తెలుసని, కాంగ్రెస్ సర్కార్ రుణ మాఫీ ఎలా చేస్తుందో తాము కూడా చూస్తామని కెటిఆర్ అన్నారు. ఎవరైనా అధికారంలోకి రాక ముందే ఆదాయ లెక్కలు చూసుకుంటారు కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు.