Site icon Prime9

MLA Vanama Venkateswara Rao: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు..తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

MLA Vanama

MLA Vanama

MLA Vanama Venkateswara Rao: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా గెలిచారు. అయితే జలగం వెంకట్రావు రెండో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యే వనమా సమర్పించిన అఫిడవిట్లో తేడాలున్నాయంటూ జలగం వెంకట్రావు హైకోర్టుని ఆశ్రయించారు. తన ఆస్తుల పూర్తి వివరాలని వనమా అఫిడవిట్లో చెప్పలేదని జలగం ఫిర్యాదు చేశారు. ఎన్నికలకి మరికొద్ది నెలలే మిగిలి ఉండగా ఈ అనర్హత వేటు పడటం గమనార్హం.

కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి ..(MLA Vanama Venkateswara Rao)

2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేసిన వనమా బీఆర్ఎస్ అభ్యర్ది జలగం వెంకట్రావుపై స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే తరువాత జరిగిన పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. కాని జలగం వెంకట్రావు మాత్రం ఆయనపై తన పోరాటాన్ని ఆపలేదు. ఆయన ఎన్నికల అఫిడవిట్ తప్పంటూ కోర్టు కెక్కారు. 2019లో పిటిషన్ దాఖలు చేయగా నాలుగేళ్ల అనంతరం కోర్టు సోమవారం తన తీర్పును వెలువరించింది.

కొత్తగూడెంపై పబ్లిక్ హెల్త్ డైరక్టర్ కన్ను..

మరోవైపు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డిపిహెచ్) జి శ్రీనివాసరావు ఆదివారం కొత్తగూడెం నియోజకవర్గం నుండి బిఆర్‌ఎస్ టిక్కెట్‌పై పోటీ చేయాలనే కోరికను వ్యక్తం చేశారు.తన తండ్రి సూర్యనారాయణ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసిన శ్రీనివాసరావు 2022 నుండి నియోజకవర్గంలో ఆరోగ్య శిబిరాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తూ సామాజిక సేవ చేస్తున్నారు.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మంత్రి కెటి రామారావుల ఆశీస్సులతో తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు పలు సందర్భాల్లో పరోక్షంగా పలు సార్లు చెప్పడం గమనార్హం.

ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు 80 ఏళ్ల వయసులో ఉన్నారని ఆయనకు ఇంకా రాజకీయాుల అవసరమా అంటూ రెండు నెలల కిందట సంచలన వ్యాఖ్యలు చేసారు.కొత్తగూడెంలో అనేక వనరులు ఉన్నాయని, ఆ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎన్నికల్లో ఆదరిస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు.కొత్తగూడెంను మంచిగా నిర్మించాలని కోరుతూ లక్ష మందికి లేఖలు రాశానని శ్రీనివాసరావు తెలిపారు.

Exit mobile version