Harirama Jogaiah:జనసేన, టీడీపీ, బీజేపీ రాజ్యాధికారం చేపట్టాలని కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. పెత్తనం సాగిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గద్దె దించాలని కోరారు. అన్నీ కులాలు ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.పాలకొల్లు కాపు సంక్షేమ సేన విస్తృతస్దాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రం మొత్తం జనాభాలో 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులున్నారని, 6 శాతం జనాభా కూడా లేని ఆర్థికంగా బలవంతుడైన జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి పెత్తనం సాగిస్తున్నారని హరిరామజోగయ్య మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు 10వేలకు పైగా ఓట్లు వచ్చిన స్థానాలు జనసేనకు కేటాయిస్తే బాగుంటుందని హరిరామ జోగయ్య అన్నారు. 70 నియోజకవర్గాల్లో 10వేలకు పైగా ఓట్లు వచ్చాయని.. వాటిని జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలనుంచి క్లీన్ చిట్ తో బయటకు వస్తారని ఆశిస్తున్నాము .ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోరి జనసేన, తెలుగుదేశం, బి.జె.పి కూటమి విజయానికి ప్రజలు పరిపాలనలలో మార్పు కోరుకుంటున్న సందర్భంలో నీతివంతమైన పరిపాలనే లక్ష్యంగా నీతివంతుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి హోదాలో నియమింపచేయటం ద్వారా అధికారం చేబట్టటానికి నడుం కట్టాల్సిందిగా రాష్ట్ర కాపు సంక్షేమ సేన పిలుపునిస్తోందని జోగయ్య పేర్కొన్నారు.