Site icon Prime9

IT Notices to Chandrababu: చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు.. సమాధానం చెప్పాల్సిందే అంటున్న ఐటీ శాఖ

chandrababu

chandrababu

IT Notices to Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి జారీ చేసిన ఐటి నోటీసుల వివరాలు వెల్లడయ్యాయి. ఆగస్టు 4న జారీ చేసిన నోటీసుల కాపీ ప్రైమ్9 చేతికి చిక్కింది. 2022 సెప్టెంబర్ నెలనుంచి ఆదాయపు పన్ను శాఖ, చంద్రబాబు నాయుడికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని తాజా నోటీసుల ద్వారా తేలింది. ఐటి శాఖ నోటీసుల్లో పేర్కొన్న సెక్షన్లపై చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కూడా ఐటి శాఖ చంద్రబాబుకి సమాధానం ఇచ్చింది. తాము జారీ చేసిన నోటీసులపై సమాధానం కచ్చితంగా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఎవరో చేసిన ఆరోపణ మినహా దానిని బలపర్చే ఆధారాలు ఏవీ ఆదాయపు పన్ను శాఖ చూపలేకపోయిందని, ముడుపులు తనకు ఆందాయనడానికి ఆధారాలు చూపకుండా తనకు నోటీసులు ఇవ్వడం సరికాదని తన సమాధానంలో చంద్రాబాబు పేర్కొన్నారు. నోటీసు ఇచ్చిన విభాగానికి దీనికి సంబంధించిన పరిధి లేదని కూడా ఆయన అందులో పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టు సంస్థల నుంచి నిధులు మళ్ళించి వాటిని చంద్రబాబుకు అందించారనే ఆరోపణలున్నాయి.

118కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలి..(IT Notices to Chandrababu)

2020-21 ఆర్ధిక సంవత్సరంలో వెల్లడించని ఆదాయంలో 118కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని ఆదేశించింది. నాలుగేళ్లుగా సాగుతున్న దర్యాప్తు అంశంలో చంద్రబాబు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని ఐటీ శాఖ సెక్షన్ 153సి ప్రకారం మరోసారి ఆగష్టు 4న నోటీసులు జారీ చేసింది. తాజా ఐటీ నోటీసులపై చంద్రబాబు ఇంకా స్పందించలేదని సమాచారం. సెక్షన్ 153సి ప్రకారం ఐటీ శాఖకు విస్తృత సోదాలు నిర్వహించేందుకు అవకాశాలు లభిస్తాయి. ఆయా సంస్థల ప్రమేయాన్ని నిర్ధారించే ప్రాథమిక ఆధారాలు లభిస్తే ఐటీ శాఖ వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

చంద్రబాబు ఆదాయ ధృవీకరణలపై ఐటి శాఖ పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తోంది. సబ్‌ కాంట్రాక్టుల కేటాయింపు ద్వారా మాజీ సిఎం చంద్రబాబుకు ఆదాయం సమకూరినట్లు ఐటీ శాఖ ఆధారాలని సేకరిచింది. 2017 నుంచి షాపూర్‌జీ పల్లోంజి అండ్‌ కో సంస్థ తరపున ఎంవిపి అనే వ్యక్తి టెండర్ల ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని అలియాస్ ఎంవిపి కార్యాలయాల్లో ఐటీ శాఖ జరిపిన సోదాల్లో ఈ వివరాలు తెలిశాయని ఐటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2019లో జరిపిన సోదాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది.నగదు లావాదేవీలకోసం సబ్‌ కాంట్రాక్టులను ఏర్పాటు చేసినట్లు ఎంవిపి ఒప్పుకున్నట్టు ఐటీ శాఖ పేర్కొంది.

బోగస్‌ వర్క్‌ ఆర్డర్‌లతో నిధుల మళ్లింపు..

ఐటీ శాఖ విచారణలో మనోజ్ వాసుదేవ్ పార్ధసాని బోగస్‌ కాంట్రాక్టులు, వర్క్‌ ఆర్డర్‌లతో షాపూర్ జి పల్లోంజి సంస్థ నిధులు మళ్ళించినట్టు అంగీకరించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. నగదు లావాదేవీల కోసం సబ్‌ కాంట్రాక్టులను ఏర్పాటు చేసినట్లు ఎంవిపి ఒప్పుకున్నట్టు ఐటీ శాఖ నిర్థారించింది. ఈ వ్యవహారంలో నడిచిన పలు మెసేజీలు, చాటింగ్‌లు, ఎక్సెల్‌ షీట్లను ఎంవిపి కార్యాలయాలనుంచి ఐటీ శాఖ సోదాల్లో స్వాధీనం చేసుకుంది. షాపూర్‌ జి పల్లోంజి సంస్థతోపాటు ఎల్‌ అండ్‌ టి సంస్థనుంచి సేకరించిన నిధుల్ని కూడా ఫినిక్స్ ఇన్‌ఫ్రా, పౌర్ ట్రేడింగ్ సంస్థల ద్వారా మళ్లించినట్లు గుర్తించినట్లు చంద్రబాబు నాయుడుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.ఇక మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఇంటరాగేషన్ వివరాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. తనని చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ డబ్బులకోసం బెదిరించారని ఎంవిపి ఆదాయపు పన్ను శాఖ అధికారులకి వాంగ్మూలం ఇచ్చాడు. హయగ్రీవ, అన్నాయ్, షలాఖా కంపెనీల ద్వారా నిధులు మళ్ళించాలని కోరారని ఎంవిపి వెల్లడించాడు. విక్కీ, వినయ్ నంగాలియా అనే ఇద్దరు వ్యక్తులు ఈ కంపెనీల నిధుల వ్యవహారాలని చూసుకునే వారని ఎంవిపి వివరించాడు. విక్కీ, వినయ్ ఇద్దరూ నిధులని టిడిపికి చేరవేసేవారని ఎంవిపి పూసగుచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులకి చెప్పాడు. ఇతర ప్రాంతాలకి కూడా విక్కీ, వినయ్ ఇద్దరూ డబ్బు తరలించేవారని ఎంవిపి వెల్లడించాడు. బోగస్ బిల్లుల ద్వారా మాత్రమే హయగ్రీవ, అన్నాయ్, షలాఖా కంపెనీలకి డబ్బులు చెల్లించాలని చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ ఆదేశించారని మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఐటి శాఖ దృష్టికి తెచ్చాడు. దీనిని తాను వ్యతిరేకించానని, పార్టీ ఫండ్ రూపంలో మాత్రమే షాపూర్ జి పల్లోంజి సంస్థ డబ్బులిస్తుందని తెగేసి చెప్పానని ఎంవిపి బయటపెట్టాడు.

అయితే పార్టీ ఫండ్ రూపంలో వద్దని బోగస్ కంపెనీల ద్వారా మాత్రమే డబ్బులివ్వాలని, తాను చెప్పినట్లు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ బెదిరించారని ఐటి శాఖ అధికారుల ఎదుట వాపోయాడు. ఈ బెదిరింపుల విషయంపై తాను షాపూర్ జి పల్లోంజి ఎండితో కూడా మాట్లాడానని, కానీ ఏం చేయలేకపోయామని ఎంవిపి ఐటి శాఖకి చెప్పాడు. ఏపీలో అప్పటికే వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న తమకి చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ చెప్పినట్లు చేయడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని ఎంవిపి వివరించాడు.

Exit mobile version