Ippatam demolitions: ఇప్పటం కూల్చివేతల కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించారని పిటిషనర్లకు జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున 14 మందికి జరిమానా విధించింది. ఆక్రమణల కూల్చివేతలకు ముందే నోటీసులు ఇచ్చినా..ఇవ్వలేదంటూ కోర్టుకు అబద్ధం చెప్పి పిటిషనర్లు స్టే తెచ్చుకున్నారని తెలిపింది.
ఇళ్ల కూల్చివేత జరగుతున్నప్పుడు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించిన ఇళ్ల యజమానులు తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇచ్చినట్లుగా ప్రభుత్వం ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది. ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి గతంలో విచారణ జరిపినప్పుడు రైతులను హైకోర్టుకు రావాలని ఆదేశించారు. ఈ రోజు విచారణలో రైతులు.. ఇళ్ల కూల్చివేత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై తమకు అవగాహన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం ప్రకటించారు.
ననంబర్ నాలుగో తేదీన ఇప్పటం గ్రామంలో ప్రధాన రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తున్నామని చెప్పి.. ఆ రోడ్డులో ఉన్న 53 ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. అంతకు ముందే వారికి రోడ్డు విస్తరణ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఉన్న ఇళ్లను తొలగించాలని లేకపోతే కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.