Revanth Reddy Warning: తెలంగాణలో కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను వేధిస్తున్నారని అటువంటి వారికి మిత్తితో సహా చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గురువారం తాండూరు నియోజక వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత. మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డీజీపీని తొలగించాలి..(Revanth Reddy Warning)
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము చేసిన వినతుల మేరకు ఎన్నికల కమీషన్ కొంతమంది అధికారులను వారి ప్రస్తుత హోదాలనుంచి తొలగించిందన్నారు. అయినా ఇంకా పలువురు అధికారులు ఉన్నారని వారు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ డీజీపీని తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. అదేవిధంగా సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్ పార్టీ అభిమానులను బెదిరిస్తున్నారని , నిఘా పెడుతున్నారని ఆరోపించారు. అరవింద్ కుమార్, జయేష్ రంజన్ తదితరులు వ్యాపారులను బీఆర్ఎస్ కు చందాలు ఇమ్మంటూ బెదిరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు సాయం చేస్తున్న 75 మంది లిస్టును కేటీఆర్ తయారు చేశారట.ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చారు. ఇంకో 45 రోజులే బీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని తరువాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ కూడా బీజేపీ నేతలాగా మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చేందుకు నేను సిద్ధం, ఒవైసీ సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమన్నారు. ఎల్బీ స్టేడియంలో 6 గ్యారంటీలపై సంతకం పెట్టడం కూడా అంతే ఖాయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.