MLA Rapaka Varaprasad: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రెండురోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న 10కోట్ల రూపాయల ఆఫర్ గురించి మాట్లాడిన మాటలు మరువకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది వైసీపీ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ దొంగ ఓట్లతోనే తాను గెలిచానని చెప్పుకొచ్చారు.
రాజోలు ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను దొంగఓట్లతో గెలిచినట్లు స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. రాపాక ప్రాంత వాసులు కాకుండా చింతలమోరి నుంచి వచ్చి దొంగ ఓట్లు వేశారని చెప్పారు. రాపాక వ్యాఖ్యలపై 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన బొంతు రాజేశ్వర్ రావు స్పందించారు. రాపాక దొంగఓట్ల విషయంపై కోర్టులో కేసు వేశానని, ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉందని చెప్పారు.చింతలమోరులో మా ఇంటిదగ్గర బూత్ లో కాపుల ఓట్లు ఉండవు. అన్నీ ఎస్సీల ఓట్లే ఉంటాయి. ఎవరో ఎవరికీ తెలియదు. సుభాష్ తో పాటు వీళ్ల జట్టు అంతా వచ్చేసి ఒక్కొక్కరు ఐదేసి, ఆరేసి ఓట్లు వేసేసి వెళ్లిపోయేవాళ్లని రాపాక అన్నారు. అంటే తాను దొంగ ఓట్లతోనే గెలిచానని ఆయన స్పష్టం చేసారు.
అంతకుమందు తాను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ.10 కోట్లు దాకా దక్కేవంటూ రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు. నేను కూడా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ఉండి ఎమ్మెల్యే రామరాజు చెప్పారు. అంతకుముందు నా స్నేహితుడు కెఎస్ఎన్ రాజుతో కూడా చెప్పారు. తరువాత డైరక్టుగా నన్నే అప్రోచ్ అయ్యారు. కాని నేను ఆ విధంగా చేయనని చెప్పానని రాపాక అన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన సీట్లలో కేవలం రాజోలులో మాత్రమే పార్టీ అభ్యర్ది రాపాక వరప్రసాద్ గెలిచారు. కానీ వెంటనే అతను అధికార వైసీపీకి మద్దతుగా మాట్లాడటం ప్రారంభించారు. క్రమేపీ వైసీపీ వైపు చేరిపోయారు. ఇలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ట్విట్టర్‌లో జనసేన అధికారిక ఖాతా 2 మిలియన్స్ ఫాలోవర్స్‌తో అగ్రస్థానంలో ఉంది. ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8.38 లక్షల మందితో రెండో స్థానంలో ఉండగా.. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ 8.10 లక్షల మందితో మూడో స్థానంలో ఉంది. అలాగే, తెలుగు దేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాకు 5.56 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. అభిమానులు జనసేనకి అండగా మాట్లాడుతూ చెప్పే మాట ఏంటంటే.. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ.. ఎదుగుతూ.. ప్రజా మద్దతు పొందుతూ వస్తున్నాం.. ఇన్నాళ్లలో మేము గెలవకపోవచ్చు.. కానీ ఓడించింది మాత్రం మేమే.. ఈసారి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం అంటూ సోషల్ మడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.